యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. - యెషయా 62:2
అనేక సందర్భములలో ప్రభువు తన పరిశుద్ధులకు క్రొత్త పేరును యిచ్చియున్నాడు. మత్తయి 16:18 లో ప్రభువైన యేసు ద్వారా సీమోనుకు క్రొత్త పేరు ఇవ్వబడినట్లు మనము చదువుచున్నాము. అప్పటి నుండి సీమోను పేతురు (రాయి) అని పిలువబడెను. తరువాత ప్రభువు శిష్యులను మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని అడుగగా, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనే గాని, రక్తమాంసములు (నరులు) నీకు బయలు పరచలేదనెను. ఆ దినము నుండి సీమోను పేరు పేతురుగా మార్చబడినది. క్రీస్తును గురించిన ఈ ప్రత్యక్షతలోనే సంఘము కట్టబడినది . ఇందుచేతనే ప్రభువైన క్రీస్తు, "ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు" అనెను. క్రీస్తును గురించిన అంతరంగ ప్రత్యక్షత నీ హృదయములో కలిగియున్న యెడల, అది మనుష్యుని ద్వారా కలిగినది కాదు. అది పరలోకమునుండి కలిగినదే. నీవు దానిని కలిగియున్నచో, నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. నీవు మనుష్య సంప్రదాయములు, ఆచారములు క్రింద ఉన్న యెడల అవి ఆత్మీయ అంధత్వమును, కలవరమును, కలహమును కలిగించును. కానీ నిజమైన విశ్వాసులు ఎవరైతే మానవసంబంధమైన, లోక సంబంధమైన, చెడిపోయిన వాటిని విడచి పెట్టుటకు సిద్ధముగా ఉండి, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, నిత్యమూ ఉండు వాటి కొరకు మనఃపూర్వకముగా వెదకుచున్నారో వారి జీవితములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష్యత పై ఆధారపడి యుండును గనుక వారు కదల్చబడరు .
పరిసయ్యుడైన సౌలు పరలోకమునుండి ఒక వెలుగును చూచి, ప్రభువు యొక్క స్వరమును విని రక్షించ బడెను. ఆ దినము నుండి అతడు ఒక నూతన వ్యక్తిగా నయ్యెను. అటు తరువాత అంతియొకయకు వెళ్లి, అక్కడ దేవుని వాక్య పరిచర్య చేయుచుండగా, సంఘములో దేవుని క్రమమును గూర్చిన గ్రహింపు లోనికి అతడు తీసికొని రాబడెను. అప్పటి నుండి సౌలు గొప్ప సువార్త సేవా పరిచర్యను ప్రారంభించెను. సౌలుకు పరిచర్యకు సంబంధించిన అనేక తలాంతులు కలవు. అయినప్పటికిని అతడు ఇష్టపూర్వకముగా అంతియొకయలోని సంఘ క్రమము ననుసరించి ప్రభువు యొక్క అధికారము క్రిందకు వచ్చెను. అప్పుడు సంఘములోని దేవుని ఉద్దేశము, క్రమమును గూర్చిన నూతన ప్రత్యక్ష్యత అతనికివ్వబడెను. అతనికి క్రొత్త పేరు పెట్టబడినది. సౌలు (నాశనము చేయు వాడు) పౌలుగా నయ్యెను. అతడు తనకొరకు జీవించ లేదు గాని సంఘము కొరకు తనను తాను వ్యయపరచు కొనెను.
సంఘము యొక్క ఆధీనములోనికి ఎట్లు రావలెనో నీవు నేర్చుకొంటివా? ఒక సాధారణమైన ఉదాహరణను తీసి కొనుము. ఎంతమంది తలిదండ్రులు వివాహ విషయములో తమ పిల్లల జీవితములను పాడు చేసిరి? వివాహ విషయమును సంఘ ప్రార్ధన లోనికి తెచ్చుటకు బదులు తమకు తాము చక్కగా ఏర్పాటు చేసికొన గలమని తలంచెదరు. ప్రియమైన వారలారా, సంఘము యొక్క ప్రేమను, సహావాసమును, ప్రార్ధనా సహాయమును పొందు ఆధిక్యత మనకు గలదు. దానిని చులకనగా తీసికొనవద్దు. సంఘము యొక్క ఆధీనము లోనికి వచ్చుట యొక్క అర్ధమును, విలువను నీవు నేర్చుకొనిన యెడల, ఈ విషయమందే గాక, ఇతర విషయములలో కూడా నీవే మాత్రము నాశనము చేయు వాడవుగా నుండక, పౌలు వలె దేవుని ఇంటిలో పనిచేయు వాడవుగా నుందువు.
No Comment to " August 31 "