Wel-Come to Our Blogger

Freely you have Recieved, Freely Give - Matthew 10:8

The prayer of the upright is His delight. - Proverbs 15:8 | యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. - సామెతలు 15:8

August 30

By G Sunil Kumar - Saturday, 30 August 2014 No Comments

ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్దరించును గాక - కీర్తన 20:1

20వ కీర్తనలో ఎన్నో వాగ్దానములు గలవు. ప్రతి యొక్క వాగ్దానము దేవుని వేడుకొనుటకు ధైర్యమును, స్వాతంత్ర్యమును ఇచ్చుచున్నది. అవి ఎంతో ప్రశస్తమైనవి, ప్రోత్సాహకరమైనవి మరియు బలపరచునవిగా నున్నవి.

"ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్దరించును గాక ( కీర్తన 20:1) మన జీవితములో ఎన్నో కష్టములు ఉండి ఉండవచ్చును, గాని ఆయన పిల్లలముగా, ఆయనచే ఏర్పరచుకొనబడినవారముగా దేవునికి మొఱ్ఱ పెట్టవచ్చును మరియు సహాయము కొరకు ఏ మనుష్యుని వద్దకు వెళ్లనవసరంలేదు. మనకు సహాయము చేయుటకు దేవుడున్నాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయము చేయునను గొప్ప నిశ్చయత గలదు. ఆ విధముగా పరిష్కరించుటకు కూడా అసాధ్యమైనట్లు కనబడు గొప్ప సమస్యలు కూడా మన ప్రేమ గల దేవునికి ప్రార్ధించుట ద్వారా పరిష్కరించబడును. "యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక (వ. 1. బి) అదే దేవుడు యాకోబును, ఇశ్రాయేలుగా అనగా రాకుమారుడుగా మార్చిన దేవుడు, మన జీవితములలో గొప్ప కార్యములు చేయగలడు. మనకు అట్టి విశ్వాసము ఉండవలెను. మనము ప్రార్ధించునప్పుడు పరలోక రాజు యొక్క సన్నిధిలో ఉందుము. గనుక ఆయన మన అవసరములన్నిటిని తీర్చును. మనకు ఏది అవసరమో అవి అన్నియు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. యాకోబు దేవుడు ఆపత్కాల సమయములలో మనలను కాపాడును, ఉద్ధరించును.

"పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక " (2వ.వ) మనము ఆయన పరలోక నివాస స్థలములోనికి వెళ్ళినప్పుడు ప్రభువు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చును. గొప్ప దేవుడు ఎక్కడ నివసించి, తనను బయలు పరచుకొని , మనలను అంగీకరించునో, అదియే దేవుని పరిశుద్దాలయము. అనగా దేవుని నివాస స్థలము. మనము ప్రార్ధించు నప్పుడు ఆయన సన్నిధిని బలముగా ఎరుగు వరకు లేదా అనుభవించు వరకు ఓపికతో వేచియుండవలెను. సీయోను, దేవుని పరలోకపు ఇంటిని గూర్చి మాట్లాడుచున్నది. మనము దేవుని నుండి ఏమి పొంది యున్నామో అది సీయోనులో నున్న దేవుని మహిమార్థమే. అందుచేత మనము దేవుని ఇంటికి వచ్చుట ఎంతో ప్రాముఖ్యము. చాల మంది ఇండ్లలో ఎక్కువగా భోజన పానాదుల గురించి తలంచెదరు, ముచ్చటించెదరు. కాని ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్ళెదమో అప్పుడు ఆయన సన్నిధిని అనుభవించెదము. మరియు అధికముగా ఆశీర్వదించ బడుదుము. సాధ్యమైనంత వరకు దేవుని భాగమును క్రమముగాను, సంతోషముగాను ఆయనకు ఇవ్వవలెను. మనము ఎంతో ఆనందముతోను, గొప్ప ఆశతోను దేవుని ఇంటికి వెళ్లవలెను.

"ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక" (3వ.వ) ఈ బలులన్నియు మనము ప్రభువైన యేసు క్రీస్తునందున్న రక్షణ యొక్క సంపూర్ణ కార్యమును గురించి మాట్లాడుచున్నవి. పాతనిబంధన గ్రంధములో ప్రభువుకు అయిదు బలులు అర్పించవలసి యున్నది. అవి: దహనబలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులన్నియు ప్రభువు మనకు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణను చూపించును. మన కొరకు సంపూర్ణముగా అర్పించబడిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితమును గూర్చి దహనబలి మాట్లాడును. ఈ బలి దేవుని సన్నిధిలో మనకు ధైర్యమును ఇచ్చుచున్నది. మన రక్షణ కొరకు ఏదైతే అవసరమై యున్నాదో ప్రభువు దానిని సిలువపై నెరవేర్చెను.కనుక మనము స్వేచ్ఛగా ఆయన యొద్దకు వెళ్లవచ్చును. ఆయన మన రుణములన్నిటిని చెల్లించి వేసెను. ఆయన మన నిమిత్తము తండ్రి అడిగి నవన్నియు తీర్చెను. పాపపరిహారార్థ బలి ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నిటిని తనపై ఎట్లు వేసికొని యున్నాడోనను దానిని గురించి మాట్లాడుచున్నది. సమాధానబలి, తనను తాను అర్పించుకొనుట ద్వారా తండ్రితో ఏ రీతిగా సమాధానపడెనో మనకు జ్ఞాపకము చేయుచున్నది. ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎంతో స్వేచ్ఛగా మనము వెళ్లవచ్చును. అదేవిధముగా నైవేద్యబలి, మన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు జీవించిన ఆయన పరిపూర్ణ జీవితమును గురించి మాట్లాడును. ఈ బలులన్నిటి ద్వారా విశ్వాసముతో, స్వేచ్ఛగా మనము దేవునికి మొఱ్ఱపెట్టుటకు ఆధిక్యత కలిగినది. మన నీతిని బట్టి గాక దేవుని నీతిని బట్టియే ఆయన దగ్గరకు మనము వెళ్ళెదము. ఆయనకు ఇచ్చుటకు మనకేమియు లేదు. ప్రభువైన యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొనెను. ఆయన మరణముతో మనలను ఐక్యపరచుకొనుట ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్లగలము. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించుట అవసరము. ఆయన ప్రేమతోను, ఇష్టపూర్వకముగాను మన అతిక్రమములను బట్టి మనకు బదులుగా ఆయన మరణించి, ఆయన పునరుర్ధానము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చెను.

Tags:

No Comment to " August 30 "