నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము - లూకా 18:3
శక్తివంతమైన ప్రార్ధనా జీవితము యొక్క రహస్యమును దేవుని వాక్యము నందు లూకా 18:1-8 లలో చూడగలము. ప్రభువు మనలను విధవరాలు వలెను, తనను అన్యాయస్తుడైన న్యాయధిపతిగాను పోల్చుకొనుచున్నాడు. ఈ వాక్య భాగము ద్వారా మన ప్రార్ధనలకు సంపూర్ణమైన జవాబు ఎట్లు పొందగలమో తెలిసికొన గలుగుచున్నాము. కొన్ని సమయములందు ప్రార్ధనలకు జవాబు వచ్చుటలో ఆలస్యమైనను మనము పట్టుదలతో ప్రార్ధించిన యెడల నిశ్చయముగా జవాబు పొందగలము. ఇక్కడ రహస్యమేమనగా, ఆ బీద విధవరాలు తన హక్కును ఎరిగి యుండెను. ఆమె అడుగు చున్నడెల్లను న్యాయ బద్ధమైనదేనని న్యాయాధిపతి యొద్దకు మాటిమాటికి వెళ్ళుచుండెను. ఆమె ఫిర్యాదు ఏమో మనమెరుగము. ఒక వేళ ఆమె ఆస్తిని ఎవరైనను బంధువులు గాని, పొరుగువారు గాని అన్యాయముగా తీసికొని యుండవచ్చును. నిశ్చయముగా న్యాయాధిపతి తనకు న్యాయము తీర్చునని నమ్మి అనుమానము లేకుండా తన ఫిర్యాదును అతని యొద్దకు తీసికొని వెళ్ళెను. మనము ప్రార్ధించు నప్పుడెల్ల అడుగు వాటినన్నిటిని పొందియున్నామని నమ్మవలెను. మనము ఆయనకు మొర్రపెట్టిన యెడల కొంత ఆలస్యమైనను, ఆయన నిశ్చయముగా మన మనవి ఆలకించును. తిరిగి జన్మించని వారు ఇట్లు ఆయన యొద్ద మనవి చేయలేరు. వారు ఏమి పొందినను దేవుని కనికరమును బట్టియే పొందుచున్నారు. గాని తిరిగి జన్మించిన వారికైతే అడిగి, పొందుటకు హక్కు కలదు. విమోచించబడిన దేవుని బిడ్డలముగా మనము ఆయన యొద్ద అడిగి పొందుటకు సర్వహక్కులు కలిగియున్నాము.
దేవుని బిడ్డలముగా, మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని, వింతైన ఐశ్వర్యమనియు నమ్మవలెను (కీర్తనలు 135:4). ఆయన ఉన్నతమైన ఉద్దేశము నిమిత్తమై మనలను ఏర్పరచు కొనెను. మన జీవితము, మన అక్కరలు ఆయన దృష్టికి ఎంతో అమూల్యమైనవి. మానవ జ్ఞానము చేత ఆయన ఐశ్వర్యము యొక్క విలువను లెక్కించలేము. ఏసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి మనలను కొనెను, గనుక మనమెంతో అమూల్యమైన వారము. మానవుల దృష్టికి మనము బలహీనులము, బుద్ధిహీనులముగా కనబడ వచ్చును గాని మనము దేవుని దృష్టిలో ఆయన స్వకీయ సంపాద్యముగా నున్నాము. ఇట్టి నిశ్చయతతో మన ప్రతి అక్కర కొరకై ఆయన యొద్ద మొరపెట్ట వచ్చును. కాని మనలో అనేక మందిమి అట్టి నిశ్చయత లేకుండా భిక్షగాండ్ర వలె నుందుము. మనము ఆయన స్వకీయ సంపాద్యము గనుక ఆయన యొద్ద అడిగి పొందుటను నేర్చుకొనవలెను. ఆయనకు స్వకీయ సంపాద్యమే కాకుండా, దాచబడిన ధనముగా కూడా ఉన్నాము (మత్తయి 13: 44) . దాచబడిన ధనముగా ఉన్న మనము ఆయనకు గొప్ప సంతోషమును తీసికొని రాగలము. ఆయన మన కొరకై గొప్ప క్రయము చెల్లించెను గనుక ఆయనకు గొప్ప ఆనందము తీసికొని రాగల ఆధిక్యత కలిగి యున్నాము. మన జీవితము ద్వారా దేవునికి సంతోషానందములు తీసికొని వచ్చునట్లు మనము ప్రార్ధించ వలెను. భూమి మీదను, భూమి క్రిందనున్న వాటి కంటెను మనము ఆయనకెంతో ఆమూల్యమైన వారము. మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని నమ్మి ఎంతో ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్లి మన సమస్యలను ఆయనకు తెలియజేయగలము.
No Comment to " September 3 "