నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును - సామెతలు 3:6
వివాహములో జతపరచబడిన దినమునుండి భార్యా భర్తలిరువురు ప్రతి విషయములోను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిరస్సత్వము క్రిందకు తీసికొని రాబడవలెను. ఆయన సంఘమునకు శిరస్సు గనుక వివాహ జీవితము నందును ఆయనను అదే విధముగా అంగీకరించవలెను. ఎందరైతే యేసు ప్రభువు ద్వారా జతపరచబడి ఆయన శిరస్సత్వమును అంగీకరించుదురో వారు సంతోషకరమైన గృహమును కలిగి యుండెదరు. వారు విశ్వాసముతో ఈలాగున చెప్పవలెను. “ప్రభువైన యేసు క్రీస్తూ, నీవే మా సృష్టి కర్తవు, నీవే సర్వ శక్తిగల దేవుడవు. నీవు మా కొరకు నరరూపధారివై మరణించి, తిరిగి లేచి మాలో నివసించుచున్నావు. మా హృదయములను, జీవితములను, సకలమైన సంకల్పములను నీకు అప్పగించు చున్నాము. నీ అనుమతి లేకుండా మేమేమియు చేయము”. ఈ విధముగా వారి వైవాహిక జీవితమును ప్రారంభించవలెను. భర్త ఈ విధముగా చెప్పవలెను. “ యేసు క్రీస్తు ప్రభువా, ఇది మీ గృహము. మేము నీ బిడ్డలము. నా చిత్తము గాని, నా భార్య చిత్తము గాని నెరవేర్చ బడకుండా కేవలము నీ చిత్తము నెరవేరును గాక.” అదే విధముగా భార్య కూడా యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిరస్సత్వము క్రిందకు వచ్చి, “అవును ప్రభువా, ఇది మా గృహము కాదు, నీ గృహమే. నీ విచ్చిన గృహమునందు మా ఇద్దరి చిత్తము కాకుండా కేవలము నీ చిత్తమే జరుగును గాక” అని చెప్పవలెను. లేని యెడల భర్త, భార్యను నీవు నా మాట వినవలెను. లేనిచో నాకు లోబడునట్లు నిన్ను చేసెదనని చెప్పును. అప్పుడు భార్య నీకంటే నాకే ఎక్కువ తెలియును మీ మాట వినమని చెప్పును. ఆ విధముగా కలహము ఆరంభమగును. ఆరంభమున మూయబడిన తలుపులు, కిటికీల మధ్య కలహము జరుగును. పిమ్మట అందరి ఎదుట, వీధులలో కూడా కలహించుకొనెదరు. సంతోషకరమైన గృహము కలిగి యుండ గోరిన యెడల వారిరువురు ఏమి చేయవలెననినను, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినను ప్రభువు యొక్క శిరస్సత్వమును అంగీకరించ వలెను. వారి వివాహ జీవితమంతటిలో దీనిని నియమముగా వారు అనుసరించవలెను. మన జీవితమునకు ఆయన చిత్తము శ్రేష్టమైనది. ఎందుకనగా మనము తలంచి, ఊహించిన దాని కంటే అత్యధికముగా ఆయన మనలను ప్రేమించు చున్నాడు.
No Comment to " September 4 "