మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచితిని - ప్రకటన 1:12,13
యెహోవా స్వరము విస్తార జలముల శబ్దము వలె నున్నది (ప్రకటన 1:15), గంభీర జలముల శబ్దమువలెను, సర్వశక్తుని స్వరమువలెను ఉన్నది (యెహెఙ్కేలు 1:24). అపొస్తలుడైన యోహానుకు ఆయన స్వరము విస్తార జలముల శబ్దమువలె వినిపించెను. "యోహానూ, నేను సర్వాధికారము కలిగియున్నాను" అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇదే విషయము ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పెను (మత్తయి 28:18). శత్రువు వరదవలె పొరలివచ్చినను (యెషయా 59:19), ఆయన సర్వశక్తిగల దేవుడు గనుక అంధకార శక్తులన్నిటి మీద ఆయనకు సర్వాధికారము గలదు. మనము ప్రతి కష్ట సమయములోను లోకస్థులైన అధికారులమీద ఆధారపడక విశ్వాసము ద్వారా ఆయన అధికారమును ఉపయోగించుకొనవలెను.
పాకిస్తాన్ దేశమునందు మార్టిన్ పూర్ అను ఊరు గలదు. 1947 వ సంవత్సరములో తూర్పు పాకిస్తాన్ నందు మహమ్మదీయులు అనేకమంది క్రైస్తవులను చంపుచుండిరి. మార్టిన్ పూర్ నందున్న క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు వారు పొలములలో దాగుకొనిరి. మూడు దినముల పిమ్మట మహమ్మదీయుల నుండి వారు పొందిన వర్తమానమేమనగా ఇకమీదట మీరు పొలములందు దాగుకొనవద్దు. మూడు రాత్రులనుండి మీ పై దాడి చేయుటకు ప్రయత్నించు చుంటిమి, కానీ మేము దాడి చేయుటకు వచ్చినప్పుడెల్లను ఒక వ్యక్తి తెల్లని గుఱ్ఱము పైన ఖడ్గము ధరించి యుండుట చూచితిమి. మీ దేవుడు మీతో ఉన్నాడని మేము ఎరిగితిమి. ఇది నిజముగా జరిగిన సంగతి. నేనక్కడికి అనేక పర్యాయములు వెళ్లితిని. దృశ్య అదృశ్య రీతిలో ప్రభువు దూతలను పంపి తన ప్రజలను కాపాడిన సమయములు కలవు. " నా దూతలు నా చేతిలో కలరు. వారు నాకు విధేయులగుదురు. నా దూతలను పంపుట మంచిదని తలంచినప్పుడు నేను పంపెదను" అని ఆయన చెప్పుచున్నాడు.
అప్పుడు యోహాను, ఆయన నోటనుండి రెండంచులు గల వాడియైన ఖడ్గ మొకటి బయలు వెడలుచుండుట" చూచెను (ప్రకటన 1:16). ఎందుకనగా, దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది" (హెబ్రి 4;12). ప్రభువు, సాతానును, తన వాక్యము ద్వారానే ఓడించుట మత్తయి 4:4 లో చూడగలము. సాతాను దేవుని వాక్యమును అపార్థము చేయుచు యేసు క్రీస్తు ప్రభువును శోధించుచుండెను. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును సరియైన రీతిగా వాడి సాతానును ఓడించెను. ఆయన నోటనుండి బయలువెళ్లుచున్న వాడియైన రెండంచుల ఖడ్గము దేవుని వాక్యము. అనేకమార్లు సాతాను మనకు అనుమానము, భయమును తీసికొనివచ్చును. అటువంటి సమయములలో "సాతానా, నా వెనుకకు పొమ్ము. ప్రభువు నిన్ను ఓడించెను. ఆయన నాతో నున్నాడు. నాపాపములను క్షమించి, నాకు సహాయకుడిగా ఉన్నాడు" అని మనము మరల, మరల చెప్పవలెను. ఇట్లు ఆయన వాగ్దానములను కోరుకొనుచు, ఇతరుల అక్కరల నిమిత్తము కూడా వాటిని అన్వయించవలెను.
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె నున్నట్లు ప్రకటన 1:16లో చూడగలము. ఆయన నీతి సూర్యుడని మలాకీ 4:2లో చూచుదుము. ఆయన కివ్వబడిన పేర్లలో ఇది ఒకటి. ఆయన ముఖము యొక్క తేజస్సు మధ్యాహ్నపు సూర్యునివలె నుండెను. సూర్యకాంతికి కొన్ని వ్యాధులను బాగుచేయు గుణము కలదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు పరలోకపు సూర్యకాంతియై యున్నాడు. ఆయన ముఖమును చూచుట ద్వారా ఆయన సన్నిధిలో ఉండి, ఆయనతో మాట్లాడుట ద్వారా అనుమానము, భయము అను సూక్ష్మక్రిములు తీసివేయబడి, మనము బలపరచబడి, ఆయన దయను అనుభవించెదము. ఇట్లు మన కొరకు మనము ప్రార్ధించుకొనుటయే గాక, ఇతరుల కొరకును విజ్ఞాపన చేయవలెను. మనము ప్రభువా, నీ సూర్యకాంతిని నామీద ప్రకాశింపజేసి, నన్ను స్వస్థపరచి, నా భయమును అనుమానమును తీసివేయుమని ప్రార్ధించవలెను.
ఇట్లు శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్ధన పరిచర్యను కలిగియుండగలము. మనము విశ్వాసము నుండి పడిపోయిన వారి నిమిత్తమును, శోధింపబడుచున్న వారి నిమిత్తమును, ప్రమాదంలో చిక్కుకొనిన వారి నిమిత్తమును, ఒంటరి జీవితముననుభవించుచున్న వారి నిమిత్తమును విజ్ఞాపన చేయుచుండవలెను. ఇట్లు చేయుట ద్వారా మనము ప్రతి శోధన మీద జయము పొందినవారమై ఆయనతో జతపనివారముగా నుందుము.
No Comment to " September 5 "